మానని గాయం.. అందించండి సాయం
విభజనతో నష్టపోయాం.. పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి లేదు
ఆదుకోవాలని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నపం
విభజన వల్ల రాజధానిని కోల్పోయిన రాష్ట్రం ఏపీనే
అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కాలేదు
ఇందుకు ప్రత్యేక యంత్రాంగం ఉండేలా చూడండి
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా సిఫార్సు చేయాలి
నేషనల్ సేవింగ్ ఇన్‌స్టిట్యూట్, కేంద్రం రుణాలు రూ.22,733 కోట్లు మాఫీ చేయాలి
జిల్లాల సంఖ్య ఆధారంగా నిధుల కేటాయింపు సరికాదు..
రాష్ట్ర సామాజిక, ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక, సేవ, ఆరోగ్య, విద్యా, మౌలిక రంగాలపై సమగ్ర వివరణ
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వినూత్న కార్యక్రమాల అమలు తీరును వివరించిన సీఎం వైఎస్ జగన్, అధికారులు
అన్ని రంగాల్లో కోలుకోవాలంటే ఉదారంగా సహాయం చేయాలని విజ్ఞప్తి
సాక్షి, అమరావతి : విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ బాగా దెబ్బతిందని.. అశాస్త్రీయంగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించడం వల్ల రాజధానిని కోల్పోయామని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. విభజన వల్ల రాజధానిని కోల్పోయిన రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనని స్పష్టం చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రం కోలుకోవాలంటే ఉదారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు అందేలా సిఫార్సులు చేయాలని కోరింది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర పరిస్థితిని వివరించారు.