భారత్‌–వెస్టిండీస్‌ టి20 మ్యాచ్‌కు టికెట్ల విక్రయం ప్రారంభం

హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో డిసెంబర్‌ 6న టీమ్‌ఇండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. టీ20 మ్యాచ్‌కు ముందు అట్టహాసంగా నిర్వహించే ఈవెంట్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీతో పాటు బోర్డు పెద్దలు, మాజీ క్రికెటర్లు హాజరవుతారని తెలుస్తోంది. టీ20 మ్యాచ్‌ టికెట్ల అమ్మకాలు శుక్రవారం ఆరంభమవుతాయని భారత మాజీ కెప్టెన్‌, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ తెలిపాడు. ఇది తనకు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ అని..దీన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తానని అజ్జూ చెప్పారు. టికెట్లను ఆన్‌లైన్‌లో www.eventsnow.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి రేపటి నుంచి కొనుగోలు చేయవచ్చు. అలాగే సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో కూడా టికెట్లను విక్రయించనున్నారు. టికెట్ల ధరలను రూ.12,500, రూ.10,000, రూ.7500, రూ.5000, రూ.4000, రూ.1500, రూ.1000, రూ.800గా నిర్ణయించారు.